JAISW News Telugu

YCP : గ్యాప్ ఇవ్వకుండా వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

YCP

YCP

YCP :  ఏపీలో చంద్రబాబు సర్కార్ జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పార్టీ ఆఫీసుల కూల్చివేత హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్ డీఏ అధికారులు కూల్చివేసిన అప్పటి నుంచి ఈ హడావుడి మొదలైంది. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా మినహా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఉన్న వైసీపీ పార్టీ ఆఫీసులకు అధికారులు నోటీసులు జారీచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయిన పలు వైసీపీ పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం కూల్చివేత అనంతరం విశాఖలోని వైసీపీ ఆఫీసుకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇదే క్రమంలో తాజాగా జగన్ సొంత జిల్లా అయిన కడపలోని వైసీపీ కార్యాలయానికి  నోటీసులు వెళ్లాయి.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని బిల్డింగ్‌ పిల్లర్‌కు నోటీసులు అతికించారు. కడప-చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్‌ నిర్మాణం చేశారు. రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏడాదికి రూ.3 వేలు చొప్పున 33 ఏళ్ల పాటు లీజ్‌ తీసుకున్నారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా, ప్లాన్‌ అప్రూవల్‌ కూడా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అనుమతిలేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో సంజాయిషీ ఇవ్వాలని వారం రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ జిల్లా అధ్యక్షుడి పేరిట నోటీసులు జారీ చేశారు.  అలాగే.. అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేటలో 1.75 ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైసీపీ ఆఫీస్ భవన నిర్మాణం పనులు దాదాపు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ భవనానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో వైసీపీ కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని అధికారులును ఆదేశించారు.

Exit mobile version