TDP Super Six : ఎన్నికల్లో ఒక పార్టీ గెలవాలన్నా.. ఓడాలన్నా మ్యానిఫెస్టోలోని అంశాలపైనే ఉంటుంది. ప్రజల కోసం ఓ పార్టీ ఏం చేయబోతోంది..అనేదానిని పొందుపరిచే మ్యానిఫెస్టోనే సదరు పార్టీలకు రాజ్యాంగం అని చెప్పాలి. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి కాకుండా అమలులో సాధ్యాసాధ్యాలను బట్టే..ప్రజలు వాటిని గుర్తించి సదరు పార్టీని గెలిపించుకుంటారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ‘ఆరు గ్యారెంటీల హామీ’ని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈక్రమంలో టీడీపీ ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలు.. గ్యారెంటీ కార్డులతో కూడిన కిట్ ను ఇంటింటికీ చేరవేస్తున్నారు. ఎన్నికలలోపు అందరికీ ఆ హామీల కిట్ చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శంఖారావం సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నారా లోకేశ్.. పార్టీని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
సూపర్ సిక్స్ హామీలపై సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. నిన్న (సోమవారం) జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ చేస్తున్నారో.. క్షేత్రస్థాయిలోనూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీలు ఆకట్టుకుంటున్నాయి. సామాన్యుల కష్టాలు తీర్చేలా పథకాలు ఉండడంతో ప్రజల్లో చర్చ బాగా నడుస్తోంది. జగన్ రెడ్డి హయాంలో పథకాలన్నీ డొల్లగా మారిపోయాయి. బటన్లు నొక్కుతున్నా డబ్బులు పడడం లేదు. రెండేళ్లుగా ఎన్ని బటన్లు నొక్కారో కానీ ప్రతీ పథకంలోనూ లబ్ధిదారులు పెండింగ్ లోనూ ఉన్నారు. ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇలాంటివన్నీ టీడీపీ జనాల్లోకి తీసుకెళ్తోంది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలకు.. గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేయడం గమనార్హం.