BJP – TDP – Janasena : టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఒక అధికారిక ప్రకటన చేశారు.. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చివరకు బీజేపీ పొత్తు ప్రకటించింది. ఎన్డీయే కుటుంబంలో టీడీపీ, జనసేన చేరవచ్చని అన్నారు.
– బీజేపీ అధికారిక ప్రకటన
డైనమిక్ లీడర్ ప్రధాని మోదీ (పీఎం మోదీ) నేతృత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయన్నారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయని.. గత దశాబ్ద కాలంలో దేశాభివృద్ధికి ప్రధాని మోదీ నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీడీపీ, జనసేన దోహదపడతాయన్నారు.
గతంలో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు ఉన్నాయని నడ్డా అన్నారు. 1996లో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు.. వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో చంద్రబాబు భాగస్వామిగా పనిచేశారని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన మద్దతు పలికిందని చెప్పారు. సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని బీజేపీ తెలిపింది. ఈ కూటమిని ఏపీ ప్రజలు స్వాగతిస్తారని, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ కూటమి దోహదపడుతుందని అన్నారు.
చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – జేపీ నడ్డా
ఎన్డీయేలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దేశ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రగతికి కట్టుబడి ఉందన్నారు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలవడం.. ఎన్డీఏలో ఈ కూటమి చేరడంతో ఖచ్చితంగా ఏపీలో ఇది గేమ్ చేంజర్ అవుతుందని.. మోడీ మేనియాతో చంద్రబాబు, పవన్ ఏపీలో గెలుస్తారని అందరూ బలంగా చెబుతున్నారు. జగన్ ఓటమికి బీజేపీ కలవడమే నాంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-పొత్తు పై హర్షం.. ముగింపు బాగుండాలి : డా. జై
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఒక మంచి నిర్ణయం.. ఏపీకి ఒక మంచి శుభసూచికం అని.. కానీ ఈ పొత్తు ఫలించి కూటమి గెలవాలని యూబ్లడ్ ఫౌండర్ డా. జై, జగదీష్ బాబు యలమంంచిలి అభిప్రాయపడ్డారు. జైస్వరాజ్యటీవీ గ్లోబల్ అడ్వైజర్ గా టీడీపీ కూటమి గెలుపును కాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. కానీ ప్రజల నిర్ణయమే శిరోధార్యం అని తెలిపారు. ఒక మంచి ముగింపు రావాలని ఆకాంక్షించారు.