BJP : ఓవైసీపై బీజేపీ కొత్త ప్రయోగం..స్కెచ్ మాములుగా లేదు..
BJP : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. కొంపెల్ల మాధవీలతను తన అభ్యర్థిగా ప్రకటించింది. నుదుట రూపాయి కాయిన్ అంతా బొట్టు పెట్టుకుని పక్కా హైందవ వేషధారణతో ఉంటూ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించడం మనకు తెలిసిందే. ఆమె విరించి హాస్పిటల్ ఎండీ అనేది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి తెలిసిందే.
ఎన్ఆర్ఐ అయిన ఆమె పాతబస్తీ మూలాలు కలిగి ఉన్నారు. విరించి హాస్పిటల్స్ ఓనర్ గానే కాక మధు సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్’ అనే ఫిన్ కార్ప్ నూ నడుపుతున్నారు. మాధవీలత ‘లోపాముద్ర ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో గణేష్ ఉత్సవ చైర్మన్ కు లేదా మరో హిందూ ఫేస్ కు చాన్సిచ్చేవారు. ఈ సారి రూట్ మార్చారు అనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా ఈ సారి మోదీ ప్రభ వెలిగిపోతున్న ఈ టైంలో ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ హైకమాండ్ గట్టి పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒవైసీ ప్రభావం కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ సర్కార్ కూడా ఎంఐఎంను గట్టిగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తోందని.. కనుక ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా నిలిస్తే.. ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓటు బ్యాంకు ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ టైంలో బలమైన కొత్త ముఖాన్ని బరిలోకి దించితే..ఒవైసీ పై గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోంది. అందుకే మాధవీలత వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.