JAISW News Telugu

BJP Twist : పొత్తు కుదిరే వేళ.. కూటమికి బీజేపీ బిగ్ ట్విస్ట్..చంద్రబాబు, పవన్ ఏం చేయనున్నారు?

BJP's big twist for the alliance

BJP’s big twist for the alliance

BJP Twist : ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. బీజేపీ ఈ వారంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ టైంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పొత్తుపై  ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో బీజేపీతో కలిసి ప్రయాణం చేయడంపై చంద్రబాబు, పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై వరుసగా జరుగుతున్న పరిణామాలతో కేంద్రం ఈ నిర్ణయం పెండింగ్ లో పెట్టిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ కేంద్రం స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో అమలు చేస్తున్న కొత్త ప్రణాళికలు.. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ సమర్థతకు పరీక్షగా మారాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కనీసం 1500మందిని పలు కారణాలతో బయటకు పంపాలని చూస్తోంది. వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా గెంటేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ ఒత్తిడి పెంచుతున్నట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసం కొత్తగా ‘వలంటరీ సెపరేషన్ స్కీం’ తీసుకురావాలని నిర్ణయించారు. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

కొద్ది రోజుల కింద జరిగిన స్టీల్ ప్లాంట్ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. ఫిబ్రవరి 2లోగా  అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని  ఆదేశించారు. ఆ తర్వాత జరిగే బోర్డు మీటింగ్ లో దీని అమలుకు చర్యలు చేపట్టనున్నారు. 30 ఏండ్ల సర్వీసు దాటిన వారికి దీన్ని వర్తింపజేసి, వారికి ఇంకా మిగిలిన సర్వీసుకు బేసిక్ పే+ డీఏ మొత్తం ఎన్ని నెలలైతే అంత ఇచ్చి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

దీని ద్వారా వెళ్లిపోయే ఉద్యోగికి పనిచేయకుండానే మిగిలిన సర్వీస్ కు కొంత మొత్తం చేతికి వస్తుంది. ఇది ఉభయులకు లాభదాయకం కాబట్టి దీనిపై ఉద్యోగులు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. విశాఖ  స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో 2021లోనే వీఆర్ఎస్ అమలు చేశారు. ఇప్పుడు కూడా ఉక్కు శాఖ ఉద్యోగులను తగ్గించాలని  అనుకుంటోంది. దీని కోసం ఈ సారి వీఆర్ఎస్ కాకుండా వలంటరీ సెపరేషన్ స్కీం తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వరు. అంటే మిగిలిన సర్వీస్ కు బేసిక్ పే, డీఏలు లెక్కించరు. కేవలం పదవీ విరమణ తర్వాత బీమా సదుపాయం, ఉచిత వైద్యం పొందే అవకాశం మాత్రమే కల్పిస్తారు. ఈ విధంగా ఆరోగ్యం బాగాలేని 700మందిని, వీఆర్ఎస్ ద్వారా మరో 800మందిని కలిపి మొత్తంగా 1500మందిని తగ్గించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.

దీనిపై కార్మిక సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏపీలో బీజేపీతో కలిసి పొత్తుకు టీడీపీ, జనసేన ముందుకు వెళ్తున్న టైంలో ఈ నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందిస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోర్టును ఆశ్రయించారు. దీంతో చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Exit mobile version