BJP Strength : మరికొన్ని గంటల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. మార్చి 16న షెడ్యూల్ ప్రకటిస్తే.. విడుదల వారీగా రెండు నెలల్లో ప్రక్రియ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అంటే కేంద్రంలో కొత్త ప్రభుత్వం బహూషా మే చివరి, జూన్ మొదటి వారంలో కొలువు దీరచ్చని తెలుస్తోంది.
కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాషాయ శిబిరం ధీమాగా ఉంది. వారి ఆశావాదానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ. ఈ ప్రాణ ప్రతిష్ఠ బీజేపీ విజయావకాశాలను పెంచిందని ఎవరూ అనుకున్నా అనుకోకున్నా.. ఒప్పుకోవాల్సిన నిజం.
ఉత్తరాదిన మంచి పట్టు సంపాదించుకున్న బీజేపీ దక్షిణాదిలో పట్టు కోల్పోయిందా? దీనిపై వివరంగా తెలుసుకుందాం. దేశం మొత్తం మోడీ వేవ్ కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి కలిసిరాలేదు. 2014 లేదా 2019 ఎన్నికల విజయాన్ని 2024 ఎన్నికల్లో బీజేపీ పునరావృతం చేయగలవా? అనే ప్రశ్నలను చాలా మందికి తలెత్తుతున్నాయి.
కర్ణాటక..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. కానీ ఓట్ల షేర్ చూసుకుంటే పాయింట్లలో మాత్రమే ఉంది. కర్ణాటకలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి స్టేట్ పార్టీని మార్చడం అలవాటు. ఈ సారి (2023) కూడా అక్కడి ఓటర్లు బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
అయితే ఇది లోక్ సభ స్థానాలపై అంతగా ప్రభావం చూపేలా కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే సెంట్రల్ లో కాంగ్రెస్ కు అంతగా కలిసి రావడం లేదు. దీంతో ఎక్కువ స్థానాలకు బీజేపీ గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. లోక్ సభ స్థానాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ
తెలంగాణలో ఎంపీ సీట్లపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ బీజేపీకి ఓట్ల షేరింగ్ మాత్రం డబుల్ డిజిట్ కు చేరుకుంది.
అయితే, ఇప్పటి వరకు కొనసాగిన సర్వేలలో కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని వచ్చాయి. కానీ షెడ్యూల్ కు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ అంచనాలు మారుతున్నాయి. మొన్న జరిగిన అమిత్ షా మీటింగ్ సమయానికి అంచనాలు మారాయి. ఇక ప్రధాని మల్కాజ్ గిరి రోడ్ షోతో మరో అంచనాకు వచ్చారు. ఇలా మారుతున్న నేపథ్యంలో బీజేపీకి ఎంపీ స్థానాల్లో డబుల్ డిజిట్ దక్కుతుందని అంచనాలు వేస్తున్నారు.
కేరళ
ఒక్క ఎంపీ సీటును దక్కించుకోవడం ద్వారా కేరళలో తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 4 ఎంపీ స్థానాలపై నాయకులు ఫోకస్ పెట్టారు.
అయితే కాంగ్రెస్ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తెలుస్తోంది. అంటే కేరళలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించాలన్న బీజేపీ కల ఈసారి నెరవేరకపోవచ్చు!
తమిళనాడు..
తమిళనాడులో అన్నా డీఎంకే కు బీజేపీకి దూరమైంది. కానీ సొంతంగా ఎదుగుతూ వస్తోంది. ఇటీవల అన్నామలై రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర ‘నా మట్టి నా మనుషులు’కు భారీ ఆదరణ దక్కింది. దీనికి తోడు రామేశ్వరంలో మోడీ పర్యటన. రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులతో ఈ సారి ఎక్కువ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోబోతోందని విశ్లేషకులు ఘంటా పథంగా చెప్తున్నారు. దక్షిణాదిన ఎక్కువ సీట్లను తమిళనాడు నుంచే కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరోసారి పొత్తులతో ముందుకెళ్తోంది. ఈ పొత్తుతో తాము మరింత బలపడవచ్చని బీజేపీ నమ్ముతోంది. ఏపీలోని ఆరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ పోటీ చేస్తోంది. అయితే ఎన్డీఏ కూటమి ఈ సారి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు వేరని వీటిలో బీజేపీ, ఎన్డీఏ సత్తా చాటుతుందని తెలుస్తోంది.