BJP : కేంద్ర మాజీమంత్రి, తమ పార్టీ ఎంపీ జయంత్ సిన్హా తీరుపై బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజా ఎన్నికల్లో ఓటుహక్కు కూడా వినియోగించుకోక పోవడంపై ఆగ్రహించింది.దీంతో చర్యలకు ఉపక్రమించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
‘‘లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పార్టీ అధిష్టానం హజారీబాగ్ లో మనీష్ జైశ్వాల్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు (జయంత్ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్ లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది’’. అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటి వరకు ఈ నోటీసులకు ఆయన స్పందించక పోవడం గమనార్హం.
మార్చి 2న జయంత్ సిన్హా తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహించిన హజారీబాగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్ జైస్వాల్ ను బరిలోకి దించింది.