BJP Political Game : దేశంలోనే బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. కానీ ఇక్కడి పార్టీలన్నీ బీజేపీతో సానుకూల వైఖరితోనే ఉండడం విశేషం. అధికార, ప్రతిపక్షాలు బీజేపీతో దోస్తీ చేయడం మరెక్కడా లేదు. దీంతో ఏపీలో బీజేపీ రింగ్ మాస్టర్ పాత్రను పోషిస్తోంది. అందరూ నేతలను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఏపీలోని అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎన్డీఏలో చేరకపోయినా.. టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపిస్తోంది. జనసేన ఎన్డీఏ కూటమిలోనే ఉన్నామంటోంది. ఇలా మూడు పార్టీలు బీజేపీతో టచ్ లో ఉన్నాయి.
అయితే బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటివరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే విషయంపైనా స్పందించలేదు. ఎన్నికల సమీపిస్తుండడంతో మొన్న ఢిల్లీ వెళ్లి అమిత్ షాను, జేపీ నడ్డాను కలిసి సమావేశమయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపే అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బీజేపీ మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధమయ్యారు. పొత్తుల విషయం చర్చించేందుకు మొన్న చంద్రబాబు వెళ్లారు. పవన్ కూడా త్వరలో వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు భేటీ తర్వాత జగన్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు.
జగన్ ఢిల్లీ యాత్ర పైకి ప్రభుత్వపరంగా అని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా రాజకీయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోపల ఏం చర్చించారు.. టీడీపీ, బీజేపీ కలువకుండా చేయగలుగుతారా అన్నది తర్వాత విషయం. కానీ రాజకీయం మొత్తం బీజేపీ తన చుట్టూ తిప్పుకుంటుందనేది వాస్తవం. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతు ఇవ్వడం ఖాయం. అందుకే బీజేపీ కూడా అడ్వాంటేజీగా తీసుకుంటోంది.