JAISW News Telugu

Kishan Reddy:కిష‌న్‌రెడ్డినే అధ్య‌క్షుడిగా కొన‌సాగిస్తారా?

Kishan Reddy:తెలంగాణ‌లో బీజేపీ పార్టీకి స‌రికొత్త ఊపుని తీసుకొచ్చిన నేత బండి సంజ‌య్‌. మ‌జ్లీస్‌కు, భారాస‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన బండి సంజ‌య్ `స‌మాధులు త‌వ్వుదాం అందులో శ‌వం వ‌స్తే మీది శివం వ‌స్తే మాది సిద్ధ‌మేనా` అంటూ మ‌జ్లీస్ పార్టీకి స‌వాల్ విసిరి రాష్ట్రంలో కాక పుట్టించారు. త‌న‌దైన మార్కు దూకుడుతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్‌ని నింపారు. పార్టీని తెలంగాణ‌లో మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తున్న త‌రుణంలో హ‌ఠాత్తుగా బీజేపీ బండి గేరు మార్చేసింది.

ఆయ‌న‌ని రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించి పార్టీ ప‌గ్గాల‌ను మ‌ళ్లీ కిష‌న్‌రెడ్డికే అప్ప‌గించి షాక్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నిక‌లు ముగిసి కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌రో సారి బీజేపీ వ‌ర్గాలు రాష్ట్ర అధ్య‌క్షుడు బాధ్య‌త‌ల నుంచి మ‌ళ్లీ కిష‌న్‌రెడ్డిని కూడా త‌ప్పిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ ఎన్నికల్లో కిష‌న్ రెడ్డి ప్ర‌భావం పెద్ద‌గా ప‌ని చేయ‌క‌పోవ‌డ‌మే.

కిష‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన అంబ‌ర్ పేట‌లో బీజేపీ అభ్య‌ర్థి కృష్ణ‌యాద‌వ్ ఓటిపోయారు. దీంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే కిష‌న్ రెడ్డి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయార‌ని, ఆయ‌న‌ని రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో పోలిస్తే బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో మంచి నంబ‌ర్‌నే సాధించింది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అంతే కాకుండా మ‌రో 19 నియోజక వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు రెండ‌వ స్థానంలో నిల‌వ‌డం విశేషం.

ఇదిలా ఉంటే త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్‌రెడ్డిని త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని, బీజేపీ వ‌ర్గాలు తెలంగాణ‌లో వ‌చ్చిన ఫ‌లితాల‌పై సంతృప్తిగా ఉన్నార‌ని, ఇప్ప‌ట్లో అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డిని త‌ప్పించే అవ‌కాశం లేద‌ని తెలిసింది. ఇదిలా ఉంటే శుక్ర‌వారం కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాయంలో రాష్ట్ర ప‌దాధికారులు, జిల్లా అధ్య‌క్షులు, ఇంఛార్జీలు, లోక్‌స‌భ ఇంఛార్జిల‌తో కిష‌న్ రెడ్డి స‌మావేశం అయ్యారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పొత్తులు ఉండ‌వ‌ని, తెలంగాణ‌లో ఒంట‌రిగానే బీజేపీ పోటీచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version