BJP Naya Game : ఒకేవైపు ‘ఇద్దరు చంద్రుల పయనం’..ఢిల్లీ పెద్దల నయాగేమ్?

BJP Naya Game

BJP Naya Game, KCR Fellow to CBN

BJP Naya Game : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండబోతోంది. బీజేపీ ఢిల్లీ పెద్దలు మరో కొత్త గేమ్ మొదలుపెట్టారు. టార్గెట్ 400 సీట్లలో భాగంగా పాత మిత్రులతో కొత్త పొత్తులకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఏపీలో టీడీపీ ఎన్డీఏలో చేరడానికి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం మొదలైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అంతర్గతంగా ఏం జరుగుతోంది..?

ఏపీలో ఎన్నికల పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. టీడీపీ ఏన్డీఏలోకి చేరే విషయమై చంద్రబాబు కొద్ది రోజుల కింద కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో మంతనాలు మొదలుపెట్టారు. పొత్తుపైన అధికారికంగా రెండు పార్టీల నుంచి ఇప్పటివరకు ప్రకటన లేదు. వచ్చే వారం ఈ పొత్తు పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తు ఖాయమైన తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఈ సారి ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారాయి. జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇక తెలంగాణలోనూ పొత్తులపైన ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతుందని ఈ ప్రచార ప్రధాన అంశం. గత ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయిన.. బీఆర్ఎస్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో పెద్దగా బావుకునేది లేదు. దీంతో రాష్ట్రానికే పరిమితం కావాలని భావిస్తోంది. అయితే పార్టీలో నుంచి అధికార కాంగ్రెస్ వైపు వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీతో పొత్తు అంశం తెరమీదకు వచ్చింది. పార్టీలో కొందరు సీనియర్లు పొత్తు అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బీజేపీతో కలిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా.. కాంగ్రెస్ కు కలిసి వస్తుందా అనే కోణంలో ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే బీజేపీలోకి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా పొత్తులపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ పొత్తుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ విస్తరణ.. సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న వేళ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

బిహార్ సీఎం నితీశ్, టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో బీజేపీని విభేదించి బయటకు వెళ్లినా..మళ్లీ బీజేపీ దోస్తీకి సై అన్నారు. ఇక కేసీఆర్ కూడా ప్రస్తుత పరిస్థితుల వల్ల బీజేపీతో స్నేహానికి రెడీ అవుతారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు, కేసీఆర్ ఒకే కూటమిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఎన్డీఏలో చేరికపై ఇటు కేసీఆర్.. అటు బీజేపీ నాయకత్వం నిర్ణయం ఏంటనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

TAGS