JAISW News Telugu

BJP Muslim card : బీజేపీ ముస్లిం కార్డు.. కాంగ్రెస్ హిందుత్వ కార్డు ఇక్కడ పని చేయలేదా?

BJP Muslim card

BJP Muslim card

BJP Muslim card : ఈసారి జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు అన్ని కోణాల్లోనూ అందరూ ఊహించినట్లుగానే కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇక్కడ  అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  ఇదే పెద్ద విజయంగా భావించారు.  పైగా ఈసారి పోలింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రజలు కూడా ఓటు వేసేందుకు భయపడలేదు. ఇది కూడా సానుకూల మార్పును ప్రతిబింబిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ ముస్లిం కార్డును ఉపయోగించడాన్ని ఇక్కడి ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని స్పష్టమవుతున్నది. అలాగే, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా కాంగ్రెస్ హిందుత్వ ఏజెండాను కూడా అదే స్థాయిలో పూర్తిగా తిరస్కరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, జమ్మూలో కాంగ్రెస్ పోటీ చేసిన హిందూ అభ్యర్థులందరూ ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే బీజేపీ బరిలో నిలిపిన  ముస్లిం అభ్యర్థులు కూడా ఘోర పరాజయాన్ని చవిచూశారు.
ఇక్కడ కూడా మూడు స్థానాల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులకు 1000 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పాంపోర్‌లో ఆ పార్టీకి 957 ఓట్లు రాగా, ఈద్గాలో కేవలం 479 ఓట్లు మాత్రమే వచ్చాయి. చన్నపొరలో కూడా బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి కేవలం 722 ఓట్లు మాత్రమే పొందగలిగాడు. బీజేపీ ముస్లిం అభ్యర్థులు ఓడిపోవడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రజల తిరస్కరణకు గురైనట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులను కాశ్మీర్ లోయలో నిలబెట్టారు. కానీ ఆ పార్టీ ఎత్తుగడ పూర్తిగా విఫలమైంది.
ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, నేటికీ బీజేపీ తన హిందుత్వ ఇమేజ్ నుంచి బయటకు రాలేకపోతున్నదని కచ్చితంగా చెప్పవచ్చు. అందుకే ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్‌లో బీజేపీ ముస్లిం అభ్యర్థులు దారుణ ఓటమిని చవిచూశారు. కొందరి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. హర్యానాలో కూడా బీజేపీకి ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ బీజేపీ బరిలో నిలబెట్టిన ఇద్దరు ముస్లిం అభ్యర్థులు కూడా ఘోరంగా ఓడిపోయారు. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టాక ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. బీజేపీని ముస్లింలు అంతగా నమ్మడం లేదు.
Exit mobile version