BJP MP Laxman : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆమె పార్టీ తృణముల్ కాంగ్రెస్ భారీగా సీట్లు కోల్పోతుందని సర్వేలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత సీట్లను కాపాడుకునేందుకు ఆమె వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ముస్లింల రిజర్వేషన్. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ కోర్టు తీర్పుతో ఆ ఆశలు కూడా నీటిపాలయ్యాయి.
లోక్ సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. 2010 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ సర్టిఫికెట్లన్నీ చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. హై కోర్టు తీర్పుపై భారతీయ జనతా పార్టీ ఎంపీ బంగారు లక్ష్మణ్ స్పందించారు.
గురువారం (మే 23) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోల్‌కతా కోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్ లాంటి విధానమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్న తెలంగాణ, వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉందని కీలక ఆరోపణలు చేసింది. కోల్ కత్తా కోర్టు తీర్పుతో ఈ రెండు రాష్ట్రాలు వారి విధానాన్ని మార్చుకోవాలని తెలిపారు. ఇదే తీర్పును కర్ణాటక ప్రభుత్వం కూడా పరిశీలించాలని అన్నారు. ఎక్కడ కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం ఉంటుందో అక్కడ ఇలాంటి అర్థం పర్థం లేని విధానాలు ఉంటాయన్నారు.
తెలంగాణలో బీసీ-ఈ పేరు మీద ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దీంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు కోల్‌కత్తా కోర్టు తీర్పుపై సీఎం మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ నుంచి తొలగించాలని వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. దీన్ని అంగీకరించేది లేదని, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని మమతా చెప్పారు. అప్పటి వరకు ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు.