BJP Mind Game : తెలంగాణలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి, నామినేషన్లు కూడా వేయించింది. అయితే ఈసారి మూడు సామాజికవర్గాలపై పెద్ద ప్లాన్ వేసింది. దాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎస్సీ వర్గీకరణ హామీ, పవన్ కళ్యాణ్ సాయంతో కాపు ఓట్లు, ఈ మూడు కలిస్తే గెలిచేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ ప్రకారమే పని చేసుకుంటూ పోతుంది. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం వస్తారని బీజేపీ ఇప్పటికే ఉధృతంగా ప్రచారం చేస్తోంది. ఇక సీఎం అభ్యర్థిగా ఇప్పటికే బీసీని చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించింది. బండి సంజయ్, ఈటల వంటి వారు ఈ పదవి కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు.
అయితే బీసీలందరూ ఏకపక్షంగా మద్దతివ్వరు కాబట్టి, మరో రెండు వర్గాల పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. మందకృష్ణ మాదిగ ఈ సభను ముందుండి నడిపించారు. ప్రధాని వంటి వ్యక్తి పిలిచి సభ ఏర్పాటు చేయమంటే మందకృష్ణ వద్దనుకుంటారా..? సభలో మందకృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చడం దగ్గర్నుంచి ఈ విషయంలో తమ నాయకుడు మందకృష్ణేనని చెప్పడం వరకూ ఆ వర్గాన్ని మోదీ ఎలా ఆకట్టుకోవాలో అలా ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ తో కూడా మోదీ అదే తరహా ప్రవర్తించారు. తమ వెనుక పవన్ ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు. మున్నూరు కాపు ఓట్లపై మోదీ కన్నేసి ఇలా చేశారని ప్రత్యేకంగా కాపు ఓట్లపై దృష్టి పెట్టే మోదీ ఇలా మాట్లాడారని అంతా అనుకున్నారు. అయితే ఈ మూడు సామాజిక వర్గాలు బీజేపీ వైపు చూస్తాయా లేదా అనేది వేచి చూడాలి.