Congress : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రము ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి గులాబీ అధినేత రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ సీఎం అయ్యారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ నాయకులు రాజకీయ నిరుద్యోగంతో సతమతమయ్యారు. ఎట్టకేలకు పీసీసీ భాద్యతలు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. అప్పటిదాకా అంపశయ్యమీద ఉన్న పార్టీ కి కాస్త రేవంత్ రెడ్డి తనదయిన శైలిలో వైద్యం చేయడంతో పార్టీ బతికి బట్ట కట్టింది. రాష్ట్రానికి తాజాగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడేంత మెజార్టీ రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాట మొదలైనది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి నే సీఎం పదవికి సరిపడే నాయకుడు అంటూ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతవరకు బాగానే ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో చెవులు కొరుకుడు మొదలైనది. మరికొందరు ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దీ రోజులే ఉంటదని బాహాటంగానే మీడియా ముందు నోరుపారేసుకున్నారు. కాంగ్రెస్ లో ఎకనాథ్ షిండేలు వస్తున్నారని మరికొందరు నాయకులు తెలిసినట్టే మాట్లాడటం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి కనబడుత లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల మాట్లాడుతూ అన్నారు. ఆగష్టు లోపు హామీలను అమలుచేయని నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఇరుక్కుపోవడం ఖాయమని అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న నాయకుడు లక్ష్మణ్ ఇలా మాట్లాడంటేనే రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయనకు ఢిల్లీ నుంచి ఉప్పు అందితేనే ఆలా మాట్లాడి ఉంటాడని కూడా రాజకీయ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన పదేళ్లలో సీఎం హోదాలో కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన కూడా హామీలను నెరవేర్చలేదు. ఆ పదేళ్ల కాలంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడు సంక్షోభం, ఎకనాథ్ షిండేలు అంటూ ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నలు రాష్ట్రంలో తలెత్తుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కూడా కాలేదు. పదేళ్ల ప్రభుత్వం పై నోరుమెదపని కమలనాధులు, పదినెలల ప్రభుత్వం పై కన్నేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం ఇష్టం లేదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.