BJP : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే దొరికిన అవకాశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. నిర్వహించే ఉత్సవాలతో కేసీఆర్ ముద్ర తొలిగిపోయే విదంగ రాష్ట్ర సీఎం రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, తెలంగాణ చిహ్నంలో మార్పులు, తెలంగాణ గీతం లో సవరణలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంబరాల్లోనే వాటిని ప్రజల ముందుకు సీఎం తీసుకురాబోతున్నారు.
వేడుకల రోజున కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రము ఏర్పడింది. అందుకు పార్టీ పరంగా సోనియా గాంధీ సహకరించారు. కాబట్టి సోనియా గాంధీని వేడుకలో ఘనంగా సన్మానించడానికి నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆవిర్భావ ఉత్సవాల వేడుకల కంటే ఘనంగా చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మూడు రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కొవ్వొత్తులతో ప్రదర్శన, పార్టీ నాయకులతో అధినేత కేసీఆర్ సమావేశం, అమరవీరులకు నివాళులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలను మాత్రం భాగస్వాములను చేయడంలేదు. ఎందుకంటే అధికారంలో లేని కారణంగా వేడుకలకు ప్రజలను దూరంగా పెడుతున్నారు.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వేడుకలను భారీ ఎత్తున చేస్తోంది. ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకున్న బిఆర్ఎస్ కూడా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పోటీగా నిర్గహించడం విశేషం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం వేడుకలకు దూరంగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ పరంగా నిర్వహించడంలేదు. అందుకు కారణం కూడా వెల్లడించడంలేదు. గతంలో కంటే పార్టీ బలం అసెంబ్లీ లో కూడా పెరిగింది. కాషాయం నేతలను ప్రభుత్వం పిలువడంలేదు. కాషాయం నేతలు నిర్వహించడంలో పెద్దగా తప్పేమి లేదనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. ఒకవేళ పార్టీ నిర్వహించాలనుకుంటే మాతృ సంస్థ సంఘ్ పరివార్ నుంచి అనుమతి వస్తేనే ఆవిర్భావ వేడుకలను నిర్వహించాడనికి పార్టీ ముందుకు వస్తుందని సమాచారం.