Rahul Gandhi : భారత దేశ ఆత్మ అయిన రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వహించిన జన జాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్, మహాత్మాగాంధీ, నెహ్రూలాంటి వారు పోరాడి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి తమ రక్తం, చెమటని ధారపోశారని అన్నారు. ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని బీజేపీ వారు అనుకుంటున్నారని, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదన్నారు.
దేశంలోని ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుబకడిన వర్గాలు, దళిత, ఆదివాసీల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారుచేస్తామన్నారు. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమచేస్తుందని వెల్లడించారు.