JAISW News Telugu

BJP : లోక్ సభ ఎన్నికల షాక్‌ నుంచి కోలుకున్న బీజేపీ

BJP

BJP VS Congress

BJP : జమ్మూకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి చాలా సునాయాసంగా మెజారిటీ మార్కును దాటేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ రౌండ్లు ముగిసే కొద్దీ బీజేపీకి ఊరట లభించింది. ఈ సారి పోలింగ్‌ జరిగిన రెండు రాష్ట్రాల్లో కాషాయ దళం అంచనాలకు మించి రాణించింది. దీంతో ఓ రకంగా ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో తగిలిన షాక్‌ నుంచి కోలుకున్నట్లు అయింది.  ముఖ్యంగా హిందీ హార్ట్‌ల్యాండ్‌కు తాళంగా భావించే హర్యానా రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పాలనలో ఉండడంతో.. తాజాగా హర్యానాను కూడా కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన వాటిపై పడుతుందని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ, ఈ విజయంతో బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం(13) చేరినట్లైంది.  హర్యానా విజయంతో 2029 ఎన్నికలకు సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ప్రత్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఓడించడం అంత తేలిక కాదన్న సంకేతాలను పంపింది.

హర్యానా చేయి జారిపోతే  మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమిపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఎల్‌జేపీ, జనతాదళ్‌ యూ వంటి పార్టీలు భవిష్యత్తులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమిపై ఒత్తిడి పెంచే ప్రమాదం నుంచి బీజేపీ బయటపడినట్లు అయింది.  మరోవైపు జమ్మూకశ్మీర్‌లోనూ ఆ పార్టీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. గతంలో 25 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 29 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తర్వాత అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఓటింగ్‌ పరంగా చూస్తే అతిపెద్ద పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కంటే దీనికే అధిక శాతం ఎక్కువ ఉండటం విశేషం. భవిష్యత్తులో పొత్తులు కుదిరితే మాత్రం అధికారం అందుకోవడం తమకు ఏమాత్రం కష్టం కాదన్న సంకేతాలను ఇస్తోంది.  ఇప్పటికే గవర్నర్‌ నియమించే ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా.. భవిష్యత్తులో జమ్మూ ప్రాంతంలో విస్తరించాలని భావించే పార్టీలు కచ్చితంగా బీజేపీతో జట్టుకట్టే అవకాశం ఉంటుంది.

Exit mobile version