BJP : లోక్ సభ ఎన్నికల షాక్ నుంచి కోలుకున్న బీజేపీ
హర్యానా చేయి జారిపోతే మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమిపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఎల్జేపీ, జనతాదళ్ యూ వంటి పార్టీలు భవిష్యత్తులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమిపై ఒత్తిడి పెంచే ప్రమాదం నుంచి బీజేపీ బయటపడినట్లు అయింది. మరోవైపు జమ్మూకశ్మీర్లోనూ ఆ పార్టీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. గతంలో 25 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 29 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఓటింగ్ పరంగా చూస్తే అతిపెద్ద పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కంటే దీనికే అధిక శాతం ఎక్కువ ఉండటం విశేషం. భవిష్యత్తులో పొత్తులు కుదిరితే మాత్రం అధికారం అందుకోవడం తమకు ఏమాత్రం కష్టం కాదన్న సంకేతాలను ఇస్తోంది. ఇప్పటికే గవర్నర్ నియమించే ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా.. భవిష్యత్తులో జమ్మూ ప్రాంతంలో విస్తరించాలని భావించే పార్టీలు కచ్చితంగా బీజేపీతో జట్టుకట్టే అవకాశం ఉంటుంది.