BJP-Chandrababu : పాత మిత్రులకు బీజేపీ గేట్లు ఓపెన్..చంద్రబాబుకు?

BJP gates open to old friends

BJP gates open to old friends

BJP-Chandrababu : కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. రామమందిర ప్రారంభోత్సవ సానుకూల వాతావరణంతో ఎన్నికలకు వెళ్లబోతోంది. తాము అనుకున్న పనులన్నీ చేశామని, దేశ అభివృద్ధి, దేశభద్రత, దేశ భవిష్యత్ తమతోనే సాధ్యమని ప్రజల్లోకి వెళ్లబోతోంది. ప్రతిపక్ష కూటమి అందనంత ఎత్తులో ఈసారి సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈక్రమంలో ఎన్డీఏను పునరేకీకరణ చేస్తోంది.

ఇప్పటికే పాత మిత్రులు కర్నాటకలోని దేవేగౌడ, కుమారస్వామి ఆధ్వర్యంలోని జేడీఎస్ బీజేపీతో దోస్తీ కట్టింది. తాజాగా నిన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీలకు బైబై చెప్పి బీజేపీతో మరోసారి జతకట్టారు. ఇక బీజేపీతో స్నేహం చేసేందుకు అకాళీదళ్, ఉద్దవ్ థాకరే వంటి వారు వేచిచూస్తున్నారు. అదే దారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి చంద్రబాబుకు లైన్ క్లియర్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తమతో బీజేపీ కలిసివస్తే జగన్, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉంటాయని, తద్వారా కూటమి అలవోకగా అధికారంలోకి రావొచ్చని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అయితే బీజేపీ ఈ విషయంపై ఎటూ తేల్చడం లేదు.

అయితే ఏపీలో  బీజేపీ ఓ సొంత సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. దీనిలో జగన్ ఏకపక్షంగా గెలిచే అవకాశాలు ఉంటే టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోదని విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్, కూటమి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంటే మాత్రం చంద్రబాబు కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అందుకే ఏపీ పొత్తులపై త్వరగా స్పష్టత ఇవ్వడం లేదు. ఏపీలో ఏ పార్టీ గెలిచిన తమకే మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో వస్తే పరోక్షంగా జగన్ బీజేపీకే మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఆయన గెలిచే పరిస్థితి లేకుంటే టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని తమ ప్రయాణం సాఫీగా ఉండేలా చూసుకోవచ్చని అంటున్నారు.

ఈ కోణంలో చూస్తే ఎన్డీఏ పునరేకీకరణలో భాగంగా చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు రెడీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే తొందరగా డిక్లేర్ చేయకపోవడంతో టీడీపీ, జనసేన శ్రేణులు, నాయకుల్లో సీట్ల విషయాలపై విభేదాలు వస్తున్నాయి. ఏ సీటు ఏపార్టీకో అనే విషయం తెలియక ఆశావహులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ నుంచి స్పష్టత వస్తేనే ఏపీ ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం ముందుకెళ్లే పరిస్థితైతే ప్రస్తుతం కనపడుతోంది.

TAGS