Musi : మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ ప్రతినిధి బృందం పర్యటన

Musi Visit BJP Leaders
Musi Visit BJP Leaders : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ మేరకు రామాంతపూర్ లోని బాలకృష్ణ నగర్ మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతున్నదని, తమను ఆదుకోవాలని స్థానికులు ఈటలను కోరారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నామని.. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోవాలని వారు ఆందోళన చేశారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, శిల్పారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. అనంతరం మేడ్చల్ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని బీజేపీ నేతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలు పడి ఇళ్లు కట్టుకున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30-40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. శని, ఆదివారం వస్తే చాలు.. వీళ్లంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోబోమని, బాధితులకు మద్దతుగా ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తామన్నారు. పేదల జీవితాలతో ఆటలు వద్దని ప్రభుత్వాన్ని ఈటల హెచ్చరించారు.