
Congress Survey
Congress Survey : దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాలని చాలా పార్టీలు ప్రెస్టేజ్ గా తీసుకుంటాయి. ప్రతీ సారి ఈ సెగ్మెంట్ వార్తల్లో ఉండనే ఉంటుంది. గతంలో రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచే గెలుపొంది పార్లమెంట్ కు వెళ్లాడు. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. ఇదే వేరే విషయం. ఈ సెగ్మెంట్ పై ఇటీవల కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయంగా బాగా పలుకుబడి సంపాదించుకున్న వ్యక్తి ఈటల రాజేందర్. ఒక్క సారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొంది సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి ఆయన. సౌమ్యుడిగా గుర్తింపు ఉన్న ఆయన వివాదాల జోలికి వెళ్లేవాడు కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా మొదటి దఫాలో.. ఆరోగ్య శాఖ మంత్రిగా రెండో దఫాలో కొనసాగారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే కాకుండా గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించి షాకింగ్ రిజల్ట్ బయటపెట్టింది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 17 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. 30 లక్షలకు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గం దేశంలోనే పెద్దది. ఈటల రాజేందర్ ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఆయన గెలుపు ఖాయమని సర్వే ఆధారంగా తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి అదే మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చరిత్ర పునరావృతమవుతుందో లేదో చూడాలి.