Janasena Alliance : ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొత్తు వేళ ఏకపక్షంగా సీట్ల ప్రకటన ఎలా చేస్తారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ రెండు సీట్లను ప్రకటించేశారు. లోకేశ్ సీఎం సీటు షేరింగ్ పై చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. పొత్తు కోసమే ఇవన్నీ తాను భరిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తున్నది.
మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ సీట్లు ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు. పొత్తు ధర్మం గురించి ప్రశ్నించారు. తాము సింగిల్ గా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ అధికారం రాదని పేర్కొన్నారు. అందుకే పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించడంతో తప్పని పరిస్థితుల్లో తానూ ఓ రెండు సీట్లను రాజోలు, రాజానగరంలను ప్రకటిస్తున్నానన్నారు.
జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగుతోంది. మరి బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో ఎలా ఏకపక్షంగా పొత్తు ప్రకటిస్తారు. అది పొత్తు ధర్మానికి విరుద్ధం కాదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉండి.. జైలులో చంద్రబాబును చూసిన వెంటనే పొత్తు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో మిత్రపక్షమని చెబుతూనే.. ఏనాడు బీజేపీతో కలిసి ఒక్క కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవడం పొత్తు ధర్మమేనా అని నిలదీస్తున్నారు.
తాను టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుని బీజేపీని కలిసి రమ్మని కోరడం పొత్తు ధర్మం అని అంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుతో సీట్లు పంచుకుని, ఏపీలో సీట్ల కోసం టీడీపీతో సీట్ల గురించి చర్చించడం సరైనా విధానమైనా అంటూ పోస్టింగ్ దర్శనమిస్తున్నాయి.
బీజేపీ నేతలు, ప్రధాని మోదీ జనసేనానికి గౌరవం ఇచ్చినా.. టీడీపీతో పొత్తు కోసం తిరిగి పవన్ వాళ్లకు అదే స్థాయిలో గౌరవం ఇస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొత్త ధర్మం గురించి మాట్లాడితే పవన్ వీటన్నంటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందనే పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.