BJP and Janasena : ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సోమవారం ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాండా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన కంటే బీజేపీకి ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పవచ్చు. తొలుత బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో జనసేనకు 24 సీట్లు కేటాయించారు. అయితే తమకు కేటాయించిన 24 స్థానాల్లో మూడు సీట్లను బీజేపీకి కేటాయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది. మరో వైపు టీడీపీ కూడా ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. బీజేపీ మొత్తంగా 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది.
సీట్లు సర్దుబాటు తర్వాత బీజేపీ, జనసేన పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు ఇలా ఉన్నాయి.
జనసేన:
1. కాకినాడ
2. మచిలీపట్నం
బీజేపీ:
1. అరకు
2. విజయనగరం
3. అనకాపల్లి
4. రాజమండ్రి
5. నరసాపురం
6. తిరుపతి