Bird Flu : బర్డ్ ఫ్లూ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ సెంటర్లు బంద్!
Bird Flu : అమ్మా బాబోయ్ బర్డ్ ఫ్లూ మళ్లొచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది పదహేను, ఇరువై ఏండ్ల కింద ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ ఎంత ప్రభావం చూపిందో. అప్పుడు మన దగ్గర ఎవరూ చికెన్, గుడ్లు తినకుండా ఉండడంతో పౌల్ట్రీ రంగం దారుణంగా దెబ్బతింది. చికెన్, ఎగ్స్ తింటే చనిపోతారని ప్రచారం జరుగడంతో ఎవరూ వాటికి జోలికి వెళ్లలేదు. అయితే ఏదో ఒక్క ప్రాంతంలో బర్డ్ ఫ్లూ సోకినా..అది దేశమంతా వ్యాపించిందని ప్రచారం జరిగింది. అయితే మన దగ్గర బర్డ్ ఫ్లూ రాలేదని ప్రభుత్వం, పౌల్ట్రీరంగ యజమానులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. చికెన్, ఎగ్స్ వంటలు వండి ప్రజలకు ఉచితంగా అందించారు. సీఎం సహ ఎంతో మంది ప్రముఖులు ‘మేము చికెన్ తింటున్నాం.. మీరు కూడా తినండి’’ అంటూ జనాలను చైతన్యవంతుల్ని చేశారు.
ప్రస్తుతం బర్డ్ ఫ్లూ పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోళ్లకు వస్తున్నా వెంటనే చర్యలు తీసుకుంటుండడంతో మనుషులకు ఆ వ్యాధి సోకడం లేదు. అయితే బర్డ్ ఫ్లూ సోకిన కోడిని సరిగ్గా ఉడికించకుండా తింటే మాత్రం ఆ ప్రభావం ఉంటుంది. కాగా, నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో H1N1 ఇన్ ఫ్లూయెంజా వైరస్ తో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయాయి. భోపాల్ లోని పరీక్ష కేంద్రానికి వీటిని పరీక్ష నిమిత్తం పంపడంతో ఇన్ ఫ్లూయెంజా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి.. ఆ ప్రాంతంలో మూడు నెలల పాటు చికెన్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోళ్లు చనిపోయిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మూడు రోజులపాటు పాటు చికెన్ సెంటర్లు మూసివేయాలన్నారు. అలాగే కిలో మీటర్ పరిధిలో మూడు నెలల పాటు చికెన్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఆ ప్రాంతాల నుంచి 15 రోజుల పాటు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి అక్కడకు కోళ్లు రాకుండా చూడాలన్నారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలన్నారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయాలని సూచించారు.