Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 ఇటీవలే ముగిసింది. ఈ రియాలిటీ షోలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్ విన్నర్‌గా ప్రశాంత్, రన్నర్‌గా అమర్‌దీప్ నిలవడంతో ఈ ఇద్దరికి సంబంధించిన అభిమానుల మధ్య ఆదివారం అర్థ్రరాత్రి ఘర్షణ జరగడం, ఆరు ఆర్టీసీ బస్సులతో పాటు పలువురి కార్లను ధ్వంసం చేయడంతో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే.
అయితే ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసంలో ప్రధాన నిందితుడిగా జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అతన్ని ఏ-1గా నిర్ధారించిన పోలీసులు అతని సోదరుడు, స్నేహితుడిని కూడా నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేసినట్టు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు. బిగ్‌బాస్ ఫైనల్ పోటీల నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఆదివారం అర్థ్రరాత్రి పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌ల అభిమానులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌నే చేర్చగా, ఏ-2గా అతని సోదరుడు మనోహార్‌ను, ఏ3గా అతని స్నేహితుడు వినయ్‌ని చేర్చారు. ఏ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్‌లో డ్రైవర్లుగా పని చేస్తున్న సాయికిరణ్(25), అంకిరావుపల్లి రాజు (23)ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తప్పు చేస్తే పోలీసులు ఆధారాలతో సహా కేసు నమోదు చేయాలని ఆయన తరుపు న్యాయవాది రాజేష్ కుమార్ అన్నారు.