Pallavi Prashanth:బిగ్‌బాస్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ చంచల్ గూడా జైలు నుంచి ఎట్టకేలకు రిలీజ్ అయ్యాడు. నాంపల్లి కోర్టు శుక్రవారం ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ శనివారం రాత్రి చంచల్ గూడా జైలు నుంచి విడుదలయ్యాడు. కేసుకు సంబంధించిన ప్రతి ఆదివారం జూబ్లీ హిల్స్ పోలీస్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రశాంత్ కేసు ముగిసే వరకు ప్రతి ఆదివారం జూబ్లీ హిల్స్ పోలస్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది.
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పాపులర్ అయిన బిగ్‌బాస్ షో సీజన్ 7లో సామాన్యుడి విభాగంలో ప్రవేశించిన పల్లవి ప్రశాంత్ తనదైన గేమ్ ప్లాన్‌తో ఫినాలేలోవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ బయట, కృష్ణానగర్ రోడ్లపై జరిగిన అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ ఆ తరువాత విధ్వంసానికి దారి తీసింది. ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ విధ్వంసానికి దారి తీసింది. పలు కార్లు ధ్వంసం అయ్యాయి.
అయితే ఈ విధ్వంసానికి ప్రధాన కారకుడిగా ప్రశాంత్‌ను నిర్ధారించిన పోలీసులు అతన్ని ఏ1 ముద్దాయిగా, అతని సోదరుడు మహావీర్‌ను ఏ2, స్నేహితుడు ఏ3గా కేసు ఫైల్ చేశారు. ఆ తరువాత ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, వీరికి 14 రోజుల పాటు రిమాండ్‌ను విధిస్తూ తీర్పు వెలువడింది.దీంతో వీరిద్దరిని చంచల్ గూడా జైలుకు పోలీసులు తరలించారు. గత నాలుగ రోజులుగా చంచల్ గూడా జైలులో ఉన్న ప్రశాంత్,అతని సోదరుడికి శుక్రవారం బెయిల్ లభించడంతో శనివారం రాత్రి విడుదలయ్యారు.