YS Jagan : ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగబోతున్నాయా.. అసలేం జరుగబోతోంది.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైందని భావిస్తున్న వేళ కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ప్రధానితో సీఎం జగన్ సుదీర్ఘ భేటీతో కొత్త రాజకీయ అంచనాలు చర్చకు కారణమవుతున్నాయి. దీంతో అసలు పొత్తు ఉంటుందా.. ఉండదా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి జనసేనాని పవన్ కల్యాణ్ దారెటు.. ఆయన ఎవరి వైపు నిలుస్తారు.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిది మరింత ఆసక్తికరంగా మారింది.
అయితే చంద్రబాబు బీజేపీ ట్రాప్ లో చిక్కుకున్నారని ఆ పార్టీలోనే చర్చ మొదలైంది. బీజేపీతో పొత్తు టీడీపీలో మెజార్టీ నేతలకు ఇష్టం లేదనేది స్పష్టమవుతోంది. జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ సైతం 2014 తరహా కూటమితోనే జగన్ ను ఓడించగలుగుతామని నమ్ముతున్నారు. అందులో భాగంగానే బీజేపీ వైఖరి తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా బీజేపీ తమతో కలిసి వచ్చేలా పవన్ మంత్రాంగం చేశారు. తాజాగా ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీతో ఇక ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమనే ప్రచారం మొదలైంది. సీట్ల అంశంపైన అంచనాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఇప్పుడు కేంద్ర పెద్దలు సీఎం జగన్ ను ఢిల్లీకి ఆహ్వానించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపు గంటన్నర సమావేశమయ్యారు. దీనిద్వారా బీజేపీ ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందనే చర్చ మొదలైంది. టీడీపీ, జనసేనలో బీజేపీ తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. తమతో పొత్తుల చర్చలు చేస్తూ.. జగన్ తో మంత్రాంగం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నా.. బీజేపీ-జగన్ మధ్య ఉన్న సత్సంబంధాలు తమపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే సందేహం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో సీట్ల విషయంలోనే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక, బీజేపీతో పొత్తు తేలి.. సీట్ల సర్దుబాటు ద్వారా పార్టీ భారీగా సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారం ఎప్పటిలోగా తేలుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ కోరిన సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆ సీట్లు రానప్పుడు బీజేపీ ముందుకు వస్తుందా లేదా అనేది మరో డౌట్. బీజేపీ ఒకవేళ పొత్తు సాధ్యం కాదని చెబితే పవన్ ఎవరి వైపు నిలుస్తారనేది ఎన్నికల్లో కీలకంగా మారనుంది. పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పొత్తు ఖాయం కావాలంటే ఆ పార్టీ అడుగుతున్న సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఢిల్లీలోని నేతలు తేల్చి చెబుతున్నారు. జగన్ తో ప్రధాని మోదీ, అమిత్ షా దాదాపు గంటసేపు మంతనాలు చేయడం. .రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయనే సమాచారంతో టీడీపీ, జనసేన అలర్ట్ అయ్యాయి. దీంతో పొత్తు వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.