Vijayawada West : విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ – బీజేపీలో భారీ సంఖ్యలో చేరిన మైనారిటీలు – వైసీపీకి దాడి జగన్ గుడ్ బై

Vijayawada West
Vijayawada West : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీలో కొన్నేళ్ళుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పశ్చిమ నియోజక వర్గం నాయకులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం జరిగిన సభలో సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి దాడి జగన్ నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరారు. అంతేకాదు పెద్ద ఎత్తున మైనారిటీ మహిళలు కూడా బీజేపీలో చేరారు.
కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరడం హర్షణీయమని సుజనా చౌదరి అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పశ్చిమ నియోజక వర్గాన్ని మోడల్ నియోజక వర్గం గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం దాడి జగన్ మాట్లాడుతూ సుజనా చౌదరి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని, ఈ నియోజకవర్గానికి ఎందరో వచ్చి వెళ్ళారని, సుజనాలాంటి నేత రావడంతో ఈ నియోజకవర్గానికి మహర్దశ రాబోతోందని, అందుకే తాము మద్దతుగా నిలిచామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నేత పైలా సోమినాయుడు, సింహాచలం దేవస్థానం ధర్మకర్త దాడి దేవి, మైనారిటీ సెల్ నాయకులు షేక్ కరీముల్లా, బీసీ నాయకులు నడకుదుటి నాగరాజు, పాము ప్రసాద్, కాళ వెంకట దుర్గారావు, భోగవల్లి శ్రీధర్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.