Ramulamma BJP Resignation : తెలంగాణలో మరో పద్నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. ఈ సమయంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతున్నానో మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే తెలంగాణ పర్యటనకు రేపు రాబోతున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.
అయితే నాలుగైదు రోజుల క్రితమే విజయశాంతి తమ పార్టీ లో చేరబోతున్నట్లు కాంగ్రెస్ లో కీలకనేత మల్లు రవి ప్రకటించారు. అయితే అలాంటిదేమి లేదని ఆమె తోసిపుచ్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆందోళనల కమిటీ చైర్మన్ కు ఆమెకు అప్పగించిన బాధ్యతలను కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఇక ఆయా సభలకు కూడా హాజరవలేదు. తెలంగాణలో పార్టీ సైలెంట్ గా మారడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇక మల్లు రవి ప్రకటించిన నాలుగు రోజుల్లోనే బీజేపీకి రాజీనామా చేశారు.
గతంలో పదేళ్ల పాటు బీజేపీలో ఉన్న విజయశాంతి ఆ తర్వాత బయటకు వచ్చి 2009లో తల్లి తెలంగాణ పార్టీ సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో విలీనం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచారు. అక్కడ అధినేత కేసీఆర్ తో పొసగక, 2014లో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్లో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. 2020లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. ఇక కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె గుర్రుగా ఉన్నారు. ఇక బుధవారం ఆమె బీజేపీకి రాజీనామా చేసి, ఇక కాంగ్రెస్ లో చేరబోతున్నారు.