Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును ఆదేశించారు.
ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు(బుధవారం) తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేశ్ లకు కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది.
ఏపీ ఎన్నికల పోరు హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే. కూటమి విజయం కోసం చంద్రబాబు అన్నీ తానై అహర్నిషలు కష్టపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సీఐడీ నమోదు చేసిన స్కిల్ స్కాంలో 53 రోజులు జైలులో ఉండివచ్చారు. ఆతర్వాత అనారోగ్య సమస్యలతో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏపీ సీఐడీ మరో మూడు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసింది. వీటిపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ప్రకటించిన హైకోర్టు.. ఈ కేసుల్లో సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ట కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని సూచించింది. దీంతో పాటు చంద్రబాబుకు కొన్ని కండిషన్లు పెట్టినట్టు సమాచారం. ఇక స్కిల్ స్కాంలో చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయింది. సుప్రీం తుది తీర్పు కోసం రిజర్వ్ చేసింది. వచ్చే వారం సుప్రీం దీనిపై తీర్పు వెలువరించే అవకాశం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.