Bhavani Revanna : లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్కే నగర్ కు చెందిన బాధితురాలి కిడ్నాప్ కేసులో సోమవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.
తన ఇంట్లో పనిచేసే ఆర్కే నగర్ కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్ ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్ పై సిట్ విచారణ కొనసాగుతోంది.