Bhashyam Praveen : వైసీపీ దాడిలో గాయాలైన వారిని పరామర్శించిన భాష్యం ప్రవీణ్
Bhashyam Praveen : సోమవారం పోలింగ్ రోజు వైసిపి గూండాలు దాడులకు పాల్పడిన ఘటనలో గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అమరావతి, సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న క్రోసూరు మండలం యర్రబాలెం, పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు, అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ టిడిపి కార్యకర్తలతో మాట్లాడి ధైర్యం కల్పించారు. ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని భాష్యం ప్రవీణ్ పోలీసులను కోరారు.
టీడీపీ కార్యకర్తలను ఎల్లవేళలా కాపాడుకుంటామని, అధైర్యం చెందవద్దని టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. రాబోయేది ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. భాష్యం ప్రవీణ్ వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.