Chandrababu Prajagalam : భాష్యం రావాలి.. దాస్యం పోవాలి..
Chandrababu Prajagalam : భాష్యం ప్రవీణ్ నియోజకవర్గమైన పెదకూరపాడులో నేడు (ఏప్రిల్ 06) ‘ప్రజాగళం’ సభ జరిగింది. ఈ సభలో మహాకూటమి నాయకుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షో భారీ సక్సెస్ అయ్యింది. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య చంద్రబాబు నాయుడు ప్రసంగం వింటూ పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలు కేరింతలు వేశారు. తమ నాయకుడు తమ నియోజకవర్గానికి వచ్చి ప్రసంగించడం చాలా ఆనందంగా ఉందంటూ పేపర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి మద్దతిస్తూ భాష్యం ప్రవీణ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నియోజకవర్గం ప్రజలు ఏకతాటిపై బాబుకు హామీ ఇచ్చారు.
భాష్యం ప్రవీణ్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తనలాగే విజన్ ఉన్న నేత భాష్యం ప్రవీణ్ అని, ఈ నియోజకవర్గంలో యూత్ ఎక్కువగా ఉందని తనకు తెలుసని అందుకే యంగ్ అండ్ ఎనర్జటిక్ పర్సన్ అయిన ప్రవీణ్ కు టికెట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలను నెరవేరుస్తానన్నారు చంద్రబాబు నాయుడు. తన రోడ్ షోలో పెదకూరపాడులో సమస్యలను చూశానని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాలంటే ప్రవీణ్ అసెంబ్లీలో ఉండాలన్నారు.
భాష్యం ప్రవీణ్ ఆలోచనలు, ఐడియాలు, విజన్ గురించి తనకు ముందు నుంచే తెలుసన్న చంద్రబాబు.. రెండేళ్ల కిందనే నియోజకవర్గంలో పనుల చేసుకోవాలని చెప్పానన్నారు. ఆయన గెలుపును ఆపడం ఎవరితరం కాదన్న చంద్రబాబు. ఆయన గెలిస్తే నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చే బాధ్యత తనదేనని హమీ ఇచ్చారు. భాష్యంపై తనకు నమ్మకం ఉందని, గెలిచి అసెంబ్లీకి వచ్చి తీరుతాడని చెప్పారు. నియోజకవర్గంలో యూత్ ను తన వైపునకు తిప్పుకున్నప్పుడే భాష్యం గెలుస్తాడని, భాష్యం గెలుపు రిపోర్ట్ తనకు ముందుగానే అందిందని చెప్పిన ఆయన డెవలప్మెంట్ పై హామీలు కురిపించారు. జగన్ కు గొడుగు పట్టే ఎమ్మెల్యేలతో పేదకూరపాడుకు ఒరిగేదేమీ లేదన్న చంద్రబాబు భాష్యంపై ప్రశంసల జల్లు కురిపించాడు.
పెదకూరపాడు ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు బండారాన్ని చంద్రబాబు బయటపెట్టారు. ఇసుకాసురుడు అయిన శంకర్ రావు అంత మంది ఇసుక డంప్ లో చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. ఇక తెలంగాణ నుంచి మద్యం డంప్ చేసి ఇంటింటికీ పంచుతూ యూత్ ను నిర్వీర్యం చేస్తూ.. తల్లిదండ్రుల శోకానికి కారణం అవుతున్నాడన్నారు. నంబూరు కొడుకు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని, తండ్రి ఎలాగూ గెలిచేలా లేడు కాబట్టి కొడుకు టీడీపీలోకి వస్తానని చెప్పుకుంటున్నాడని, ఆయనను రాణివ్వాలా తమ్ముళ్లు అంటూ నియోజకవర్గం అభిప్రాయం కోరారు చంద్రబాబు. జగన్ మాయలపకీరుగా మారి ఇలా నియోజకవర్గానికి ఒక చోటా మాయలపకీరులను మోహరిస్తున్నాడన్నారు.
పెదకూరపాడు హామీలైన డబుల్ రోడ్డు, బ్రిడ్జీలు ఇంకా చాలా సమస్యలను నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చారని, ప్రభుత్వం రాగానే వాటి అమలే ఫస్ట్ అంటూ హామీ ఇచ్చారు. ఐదేళ్లలలో నంబూరు చేసిన అభివృద్ధి ఏం లేదని అందుకు నిదర్శనం తమ వద్ద ఉన్న సమస్యల పత్రాలే అన్న బాబు.. వీటిని వెంటనే పరిష్కరించాలంటే భాష్యంను తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లాలని అన్నారు.