Nitish Kumar : నితీశ్ కుమార్ కు భారతరత్న ఇవ్వాలి.. పాట్నాలో వెలసిన పోస్టర్లు

Nitish Kumar
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు ‘భారత రత్న’ ఇవ్వాలని రాజధాని పాట్నాలో పోస్టర్లు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. నితీశ్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నగరమంతా ఆయన పార్టీ జనతా దళ్ పోస్టర్లు అంటించినట్లు సమాచారం. ఆ గౌరవాన్ని పొందేందుకు ఆయన అర్హులని పార్టీ పేర్కొంది.
పార్టీ కార్యాలయం గోడలపై పోస్టర్లు ఉండడంతో మీడియా జేడీయూ ప్రతినిధులను ప్రశ్నించింది. ‘‘నితీశ్ కుమార్ కు కచ్చితంగా భారత రత్న ఇవ్వాలనేది మా డిమాండ్ కాదు. కానీ, ఆ గౌరవాన్ని అందుకునేందుకు ఆయన పూర్తిగా అర్హులు’’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర సీఎంగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన నితీశ్ కుమార్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహించనున్నారు.