LK Advani : రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశప్రగతిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు. ‘‘అద్వానీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నాం. ఆయనతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పా. ఈ తరానికి చెందిన రాజనీతుజ్ఞుల్లో ఆయన ఒకరు. క్షేత్ర స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. ఆయనకు పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది.’’ అని మోదీ రాసుకొచ్చారు.
ఆయన జీవిత విశేషాలు..ఘనతలు..
ఎల్ కే అద్వానీ పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య చదివారు. పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య చదివారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వహించారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్ కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలో విజయం సాధించారు. 1977లో ఢిల్లీ మెట్రోపాలిటిన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా అద్వానీ ఎంపికయ్యారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన అద్వానీ.. 1973-76లో జన్‍సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1974-76లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అద్వానీ పనిచేశారు. జనతా పార్టీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా 1977-79 వరకు ఉన్నారు.
బీజేపీ ఏర్పాటు..
1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని వాజ్ పేయితో కలిసి స్థాపించారు. 1996లో వాజ్ పేయి ప్రధాని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. ఆతర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. వాజ్‍పేయి ప్రధానిగా, అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా అద్వానీ విధులు నిర్వహించారు. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అద్వానీ.. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీ.. 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
రథయాత్ర..
వాస్తవానికి బీజేపీకి జోష్ తెచ్చింది. దేశంలో బీజేపీ అనే పార్టీ ఉందని అందరికీ తెలిసింది అద్వానీ చేసిన రథయాత్రతోనే. అందుకే అద్వానీ దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. బీజేపీ ఇప్పుడు బలంగా మారడానికి అనాడు అద్వానీ వేసిన పునాదులే కారణం. అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో అద్వానీ రథయాత్ర చేశారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుంచి మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఈ యాత్ర ప్రభంజనంలా సాగింది. లక్షలాది మంది కార్యకర్తల్లో ఉత్తేజం వచ్చింది. ఆ తర్వాతే బీజేపీ సిద్ధాంతాలు, భావాలు జనాల్లోకి ప్రబలంగా వెళ్లాయి. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిర నిర్మాణం ఇలా అనేక సంఘటనలు చరిత్రలో లిఖితమయ్యాయి. ఈ చరిత్రకు ప్రధాన కారకుడు అద్వానీ కావడం విశేషం.