Bhagyanagaram : ‘భాగ్యనగర’ విలాపం.. నిర్మాణుష్యంగా జనావాసాలు!
Bhagyanagaram : ఇసుక వేస్తే రాలనంత జనం.. వందలాది కార్లు.. ఎటువైపు చూసినా సందడే.. అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆపసోపాలు పడాల్సిందే. ఇక ట్రాఫిక్ జామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఇదీ.. భాగ్యనగరం (హైదరాబాద్) గురించి.. మనకు తెలిసింది. ఇలాంటి నగరం.. పలకరించేవారు లేక బోసిపోయింది. ప్రధాన ప్రదేశాలు, వీధులు, ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇక ఇళ్లకు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. అలజడి లేదు.. చాయ్ కొట్ల వద్ద కూడా సందడి లేదు.
మనిషిని మనిషి తగలకుండా వెళ్లలేని బేగం బజార్.. నిర్మానుష్యంగా మారింది. రోడ్డుపై ఇటు నుంచి అటు వెళ్లాలంటేనే పావుగంటకు పైగా పట్టే ఖైరతాబాద్ జంక్షన్ లో చిన్నారులు సైకిల్ రేసులు నిర్వహించుకున్నారు. నిత్యం హారన్ల దద్దరిల్లే.. కూకట్‌పల్లి జంక్షన్.. వాహనాలు లేక, బోసిపోయింది. ఇదీ.. హైదరాబాద్ పరిస్థితి. సంక్రాంతి పండగతో కలుపుకొని 3 రోజులు సెలవులు రావడంతో భాగ్యనగర్ వాసులు సొంత ఊళ్లకు పనయమయ్యారు. నిత్యం రోపు వారి పనుల్లో బిజీగా ఉండే నగర జనం.. పల్లె బాటతో నిర్మానుష్యంగా మారింది.
హైదరాబాద్‌లోని ప్రతీ ప్రాంతంలోని రోడ్డు ఖాళీగా ఉన్నాయి. పండుగను పురస్కరించుకొని నగరవాసులు సొంత ఊర్లకు వెళ్లారు. ఐటీ కారిడార్, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్లు జనంలేక ఖాళీగా కనిపించడం ముచ్చటేస్తుంది. జనం అలికిడి.. వాహనాల రొధ లేక, రహదారులన్నీ.. మౌనంగా ఉండిపోయాయి. అప్పుడప్పుడు వచ్చి పోయే ఒకటి, రెండు వాహనాలు తప్ప రోడ్లపై ఎవ్వరూ కనిపించడం లేదు.
దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం రాజధానికి వచ్చిన వారు.. ఇక్కడ స్థిరపడ్డవారు.. ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికి వచ్చినవారు.. చదువుకుంటున్న వారు ఇలా అన్ని వర్గాల వరకు.. సొంత ఊరి బాటపట్టారు. అధికారిక లెక్కలను బట్టి చూస్తే ఏపీ వైపే మెజారిటీ ప్రజలు వెళ్లారని తెలుస్తోంది. హైదరాబాద్-విజయవాడ రూటు ఇప్పటికీ బిజీగానే ఉందని తెలుస్తోంది.