Bandi Sanjay : గోల్డెన్ టెంపుల్ గా భాగ్యలక్ష్మి ఆలయం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

Bandi Sanjay
Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందంటే దానికి భాగ్యలక్ష్మి అమ్మవారి దయ ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ విజయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు.
కార్యకర్తలో పాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. నిన్న (గురువారం) హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు బండి సంజయ్ తెలిపారు.