AP Bettings : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై బెట్టింగుల జోరందుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై బెట్టింగులు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలపై బెట్టింగుల హవా కొనసాగుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పుంజుకున్నందున అధికార పార్టీ బీఆర్ఎస్ గెలుస్తుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా చెబుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడేది ఏ ప్రభుత్వమనే వాదన అందరిలో వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, ఉభయ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేక కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందా అనే కోణంలో బెట్టింగులు నడుస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణలో ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలలో గెలుస్తాడా? కొడంగల్ లో రేవంత్ రెడ్డి ప్రభావం చూపుతాడా? నల్గొండలో కోమటిరెడ్డి విజయం సాధిస్తాడా? అంటూ బెట్టింగ్ లకు దిగుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మెజార్టీ ఎంత వస్తుంది? మెజార్టీ సాధిస్తారా? లేక ఓటమి పాలవుతారా అనే చర్చ జోరందుకుంటోంది. దీంతో పందేల గోల మొదలైంది.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగుల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల వేళ బెట్టింగులకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో చాలా డబ్బు పెడుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలు పందెం రాయుళ్లకు కూడా పండగే అన్నట్లు చెబుతున్నారు. బెట్టింగుల్లో రూ. లక్షలు పెడుతున్నట్లు సమాచారం. క్రికెట్ బెట్టింగులు చూశాం కానీ ఎన్నికల బెట్టింగులు కూడా రావడం ఆశ్చర్యకరమే.