Botsa Satyanarayana : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వైసీపీకి కొత్త ఊపునిచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆందోళనలో ఉన్న వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీయాదవ్ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. అయితే విశాఖ ఎమ్మెల్సీ సీటు విజయం వెనుక జగన్ ఒక్కడే ఉన్నాడు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉంది. అయితే కూటమి అధికారంలోకి ఉండడంతో ఏమైనా జరగొచ్చనే చర్చ సాగింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. అభ్యర్థి ఎంపిక నుంచి ఓటర్లను కాపాడే వరకు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యూహాలు రచించారు. విశాఖ సీటు వైసీపీకి దక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థిని ప్రకటించిన క్షణం నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలతో వైసీపీ హడావిడి చేసింది. ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లు పక్కదారి పట్టకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పాటు సొంత సామాజికవర్గం కూడా బొత్స కోసం కష్టపడింది.
జగన్ సలహాలు, సూచనలతో అభ్యర్థి అయిన బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఓటర్లను ప్రచారానికి తరలించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను బెంగళూరు తరలించారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పర్యటన బాధ్యతలు అప్పగించిన జగన్.. ఎప్పటి కప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. ఓటర్లను కాపాడుతూనే.. మరోవైపు కూటమిని కార్నర్ చేశారు. టీడీపీకి బలం లేకపోయినా పోటీ చేస్తున్నారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదన్న నిర్ణయానికి టీడీపీ వచ్చింది. ఏది ఏమైనా విశాఖ గెలుపు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.