OC Vs BC in Manthani : మంథని లో గెలుపు జెండా ఎవరిది..? ఓసీ వర్సెస్ బీసీ పోరులో విజయమెవరిది..?
OC vs BC in Manthani : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఈ సారి పోరు రసవత్తరంగా సాగుతున్నది. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పుట్టమధు, బ్రాహ్మణ బిడ్డగా ఉన్న శ్రీధర్ బాబు ను ఈ ఎన్నికల్లో ఢీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో శ్రీధర్ బాబు పై చేయి సాధించగా, ఈసారి జరిగే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
అయితే శ్రీధర్ బాబు, పుట్ట మధు తొలుత కాంగ్రెస్ నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వతా పుట్టమధు టీడపీలో చేరి, జడ్పీటీసీగా గెలుపొందారు. మొదటి సారి మంథని నియోజకవర్గంలో బ్రాహ్మణ అధిపత్యానికి చెక్ పెట్టిన ముద్ర వేసుకున్నారు. ఇక పీవీ నరసింహారావు, శ్రీపాదరావు, శ్రీధర్ బాబు ఇలా మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పుట్ట మధు చెక్ పెట్టారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో తిరిగి శ్రీధర్ బాబు తన ఆధిపత్యాన్ని చాటారు.
ఇక 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన పుట్టమధు ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పుట్ట మధుకు 80 వేల ఓట్లు రాగా, శ్రీధర్ బాబుకు 65 వేల ఓట్లు పోలయ్యాయి. బీసీ వర్గాలను కలుపుకొని పోయి పుట్టమధు ఈ ఎన్నికల్లో గెలిచారు. ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్ దీవెనలతో ఆయన గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో పుట్టమధు ఓడిపోయారు. అయితే మరోసారి కేసీఆర్ ఆశీర్వాదం జడ్పీ చైర్మన్ అయ్యారు. 2019లో జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి, జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇక ఆయన సతీమణి పుట్ట శైలజ మంథని మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యారు.
అయితే ప్రస్తుత ఎన్నికల్లోనే శ్రీధర్ బాబు, పుట్టమధు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే తనతోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివిరిస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యర్థులు డబ్బులతో నాయకులను కొంటున్నారని, ఇటీవల సీఎం కేసీఆర్ ముందు పుట్ట మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోసారి బీసీ కార్డుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
మంథని నియోజకవర్గంలో దాదాపు 9 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, చేసిన అభివృద్ధి ఏంటో ఆలోచించాలని కోరుతున్నారు. శ్రీధర్ బాబు ఎన్నికల సమయంలోనే మంథని లో కనిపిస్తాడని, ఇక హైదరాబాద్లో నే మకాం పెడుతాడని చెబుతున్నారు. తాను మాత్రం స్థానికంగానే ఉంటూ ప్రజల మనిషిగా ఉంటున్నానని చెబుతున్నారు. శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు రాజకీయాన్ని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ తోనే ప్రగతి సాధ్యమని, బీఆర్ఎస్ కు ఓటేయాలని కోరుతున్నారు.