Team India Burden on Toss : బ్యాటింగే ఫస్ట్…టాస్ పైనే భారం

Team India Burden on Toss

Team India Burden on Toss

Team India Burden on Toss : ప్రపంచకప్‌ సెమీస్‌ పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తొలి సెమీస్‌ జరగనుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనున్నది.  రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఢీకొననున్నది. ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలపై ప్రస్తుతం  చర్చ సాగుతున్నది.

అయితే వాంఖడే, ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌లు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి.? పరుగులు పారుతాయా? వికెట్ల హోరు కొసాగుతుందా? అనే ఆసక్తి మొదలైంది.

పరుగుల వరద  

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మొదటి సెమీస్‌కు వేదికగా నిలిచే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమనే తెలుస్తున్నది. ఈ సారి  ఇక్కడ అన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై 382 రన్స్ సాధించింది. శ్రీలంకపై టీమ్‌ఇండియా 357  స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ 291 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో మ్యాక్స్‌వెల్‌ అద్భుతమైన డబుల్ సెంచరీ కొట్టాడు. బ్యాట్స్‌మెన్ కు అనుకూలించే ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు భారీ స్కోరు నమోదు చేయొచ్చు. ఆట సాగుతున్న కొద్ది పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అయితే లక్ష్య ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారం ఉంది.

రెండింటికీ అనుకూలం 

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ లో జరిగనుంది. ఈ పిచ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సమానంగా సహకరిస్తుంది. టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్‌పై 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్ జట్టు ప్రత్యర్థిని 142కే కుప్ప కూల్చింది. మరో మ్యాచ్‌లో మొదట బంగ్లాదేశ్ 204 చేయగా.. పాకిస్థాన్‌ జట్టు 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌ 326 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బౌలింగ్‌లో చెలరేగి సఫారీ జట్టును 83కే ఆలౌట్ చేసింది. పాకిస్థాన్‌ టీమ్ పై ఆసీస్‌  జట్టు 337 పరుగులు చేసింది. 93 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడ నమోదైన స్కోర్లు చూస్తే ఈ పిచ్‌ మొదట బ్యాటింగ్‌కు, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు సహకరిస్తున్నదని చెప్పవచ్చు. పటిష్టమైన బౌలింగ్‌ ఉంటే మొదట బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు కప్‌ గెలవకుంటే..  

‘‘ప్రస్తుతం ప్రపంచకప్‌లో టీమిండియా ఆట తీరుతో అభిమాను ఆనందాలకు అవధుల్లేకుండా పోతున్నది. 12 ఏళ్ల క్రితం స్వదేశంలోనూ టీమ్‌ ఇండియా ప్రపంచ కప్ గెలిచింది. భారత్‌కు మరోసారి అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో వాళ్లకిదే మంచి అవకాశం. ఈసారి అవకాశాన్ని కోల్పోయినట్లయితే మళ్లీ విజేతగా నిలిచే స్థాయికి వెళ్లడానికి మరో మూడు వరల్డ్ కప్ ల సమయం పట్టే అవకాశం ఉంది. జట్టులో ఏడు నుంచి ఎనిమిది మంది క్రికెట్ల కెరీర్‌ చివరి దశలో ఉన్నారు. వారికి ఇదే చివరి ప్రపంచకప్‌ కావొచ్చు’’  అని రవి శాస్ర్తి పేర్కొన్నారు.

TAGS