Banyan Tree Fruits : మర్రిచెట్లకు యాపిల్ పండ్లలా కాస్తున్న పండ్లు.. వింత ఏంటంటే?
Banyan Tree Fruits : ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూర్ నియోజకవర్గం, జాపాడు బంగ్లా మండలం, తరిగోపుల గ్రామంలో కెనాల్ వెంబడి వెళ్తుంటే దాదాపు 500 ఏళ్ల క్రితం ఉన్న అతిపెద్ద మర్రిచెట్లు కనిపిస్తుంది. సమీప గ్రామాల ప్రజలు ఈ చెట్టును అత్యంత భక్తితో చూస్తుంటారు. నీడకే కాదు.. మర్రి పళ్లతో పశు పక్షాది ఆకలి తీరుస్తుంది.
ప్రతీ ఎండాకాలం ఎండల తీవ్రత బట్టి చాలా మంది జంతు, పక్షి ప్రేమికులు మూగ జీవాల కోసం సదుపాయాలు కల్పిస్తుంటారు. పండ్లు, కాయలతో పాటు భోజనం అందించడం, కొన్ని కొన్ని ప్రదేశాల్లో తాగునీటి కుండీలను ఉంచి అందులో నీటిని పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో, అడవి మార్గంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
మూగ జీవాలకు, పశు పక్షాదులకు ఈ మర్రి చెట్లు సరిపోయేంత ఆహారం అందిస్తుంది. అందుకే ఇక్కడికి వందల సంఖ్యలో పశువులు, పక్షులు వస్తాయి. ఈ చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి ఆ ప్రాంతాన్ని మొత్తం ఆవరించి ఉంటుంది. మహా వృక్షంగా ఎదిగిన ఈ చెట్టు కిందకు ఎంతో మంది వచ్చి సేదతీరుతుంటారు. ఈ చెట్టుకు యాపిల్ పండ్ల మాదిరిగానే చిన్నచిన్న ఎర్రటి పండ్లు కనిపిస్తాయి.
వీటితో కడుపు నింపుకునే మూగ జీవాలు ఎన్నో ఉన్నాయి. పైగా ఈ మర్రి పండ్లు ఒక్క జంతువులు తినడమే కాదు.. మనుషులు కూడా తినవచ్చు. మంచి పౌష్టికాహారంగా ఈ పండ్లు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సీజనల్ గా కాసే ఈ పండ్లతో కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులు నయం అవుతాయని చెప్పవచ్చు. కొన్ని కొన్ని ఆయుర్వేద ఔషదాలలో ఈ పండ్లను ఉపయోగిస్తారు.
పక్షులను ఎక్కువగా ఆకర్షించేందుకు ఈ చెట్టు పండ్లను కాస్తుంది. పక్షులు ఈ పండ్లను తిని మరో చోట మలంతో పాటు వదలడంతో అక్కడ పెరిగిపెద్దవుతాయి. అయితే ఈ మర్రి పండ్లు పక్షులకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని జంతు ప్రేమికులు చెప్తున్నారు.