Bangladesh MP : కోల్ కతాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న ఫ్లాట్ లోని సెప్టిక్ ట్యాంక్ లో మాంసం ముద్దలు, వెంట్రుకలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) కోల్ కతాలో ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్ మెంట్ లోని సెప్టిక్ ట్యాంక్ లో బెంగాల్ సీఐడీ దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలను గుర్తించాయి. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్ లో లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు.
బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్ కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్ మెంట్ లో బస చేసిన ఆయన, కొన్ని రోజుల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్ లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్ మెంట్ లోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.