Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి సినీనటి హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెకు రెండు సార్లు నోటీసులు పంపారు. గత నెల 27న కేసు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపగా, నటి హేమ మాత్రం విచారణకు హాజరుకాలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు ఒక వారం గడువు కావాలని కోరింది. దీంతో సీసీబీ పోలీసులు మరో నోటీసును పంపారు. జూన్ 1న విచారణకు హాజరు కావలసిందిగా తెలిపారు. అప్పుడు డుమ్మా కొట్టిన హేమ, తాజాగా విచారణకు హాజరయ్యారు.
హేమ బుర్కా ధరించి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలోకి చేరుకున్నాక అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె నుంచి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం లభించకపోవడంతో చివరికి అరెస్టు చేశారు. పార్టీలో నేనేమీ పాల్గొనలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ తొలుత ఆమె బుకాయించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అప్పట్లో ఆమె తీరుపై నగర పోలీసు కమిషనర్ దయానంద్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.