Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లు అడ్డంగా చిక్కిపోవడంతో ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులకు, సినీ రంగానికి చెందిన కొందరికి టెన్షన్ పడుతున్నారు. అయితే, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటే, లేదులేదు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటూ వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
ఈ కేసులో విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసును పోలీసులు ఏ1గా చేర్చారు. ఏ2 ముద్దాయిగా ఉన్న అరుణు కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవాడని తెలియడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అరుణ్ కుమార్ కు చిత్తూరు టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయంటూ ఇన్ని రోజులు వైసీపీ నాయకులు ఆరోపించారు.
అయితే, ఇప్పుడు టీడీపీ నాయకులు కథను కొత్త మలుపు తిప్పుతున్నారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం మడవనేరి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ బెంగళూరులోని కోరమంగళలో స్థిరపడి అక్కడే వైద్య రంగానికి చెందిన వ్యాపారం చేస్తున్నాడని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ కు వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి భార్గవ్ రెడ్డితో పరిచయాలు అయ్యాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పరిచయం అయ్యిందని, తరువాత ఏపీలోని వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవారని, ఇలా వైసీపీ నాయకులతో అతనికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే అరుణ్ కుమార్ కు బెంగళూరు రేవ్ పార్టీ ఏ1 నిందితుడు వాసుతో పరిచయమైందని టీడీపీ ఆరోపిస్తోంది. బెంగళూరులో వాసు, అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవారని, ఇలా వారి స్నేహం రేవ్ పార్టీ నిర్వహించే వరకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే, బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు దర్యాప్తు పూర్తిచేసి మొత్తం సమాచారం అధికారికంగా వెల్లడించే వరకు ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు.