Bandla Ganesh:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తాను నెల రోజుల క్రితమే చెప్పానని ఆ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజం అయ్యాయని తెలిపారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ముందే ఎలా అంచనా వేశారని ప్రశ్నిస్తే బండ్ల గణేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు.
పోరాడే వారికే కత్తి ఇస్తారు. కత్తి ఇచ్చే వారికే కిరీటం ఇస్తారు. దీనిలో పెద్ద లాజిక్కేం లేదు. రేవంత్ రెడ్డి పడిన కష్టం. మాట తీరు, జనంలోకి చొచ్చుకెళ్లిన విధానం చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం. వచ్చింది. కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా పని చేస్తుంది` అని తెలిపారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్.
అంతే కాకుండా ఇకపై కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ `తానెప్పుడూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని, ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నందున ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉన్నట్టు బండ్ల గణేష్ చెప్పారు. 2004 నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నాను. నేను కాంగ్రెస్ వాదిని. అది ప్రపంచానికి తెలిసిన నిజం. మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది` అన్నారు.