Bandla Ganesh:తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా మరి కొద్ది క్షణాల్లో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందు కోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టదిట్టమైన భద్రత మధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. రేవంత్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫంక్షన్‌లలో, ఇంటర్వ్యూల్లో తనదైన స్టైల్ వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించే బండ్ల గణేష్ ఈ సారి రేవంత్‌రెడ్డిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ప్రీ రిలీజ్ వేదికలపై ఆయన ఇచ్చే స్పీచ్‌లు నవ్వులు పూయిస్తుంటాయి. అదే తరహాలో తెలంగాణ రాజకీయాలపై కూడా బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో కోసుకుంటానని చెప్పారు.
అయితే ఆ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ గెలిచి అధికారాన్ని మరో సారి చేపట్టడంతో బండ్ల గణేష్ ఎక్కడ కనిపించినా, సోషల్ మీడియా వేదికపై కూడా నెటిజన్‌లు, మీడియా బ్లేడ్ గురించి ప్రస్తావించే వారు. అయితే ఇప్పుడు కాలం మారింది. తెలంగాణలో అధికారం మారింది. బండ్ల గణేష్ అత్యంత వీర విధేయుడిగా ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతోంది. దీంతో బండ్ల గణేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం గా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రేవంత్‌రెడ్డి అన్న అంగీకరిస్తే ఆయన జీవిత కథతో సినిమా తీస్తానని ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్లు ఉన్నారని.. ఆయనను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గణేష్ అన్నారు. తనని ఇబ్బందులు పెట్టిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జీవితంలో రేవంత్ ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేస్తూ బయోపిక్ తీయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇక ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్ తన అభిమాన నేత రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చూడాలని ఆరాటపడుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా రేవంతన్నకు ఆకసి, కసి, కష్టం, పాలన తెలుసన్నారు. ట్విట్టర్‌లో కేటీఆర్ కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫొటో చూసి భయపడ్డానని.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలర్టుగా ఉండమని కార్యకర్తలకు చెప్పానని..కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమన్నారు.