Vijay Political Entry : విజయ్ దళపతి.. తమిళనాట ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు..రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో ఆయన. విజయ్ తల్లిదండ్రులిద్దరికీ సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నా.. సినిమా అవకాశాలు ఈజీగా రాలేదు. చిన్నప్పుడు చెల్లి విద్య అకాల మరణంతో తీవ్ర మనోవేధనకు గురైన విజయ్ మొదట డాక్టర్ అవుదామనుకున్నాడు. తండ్రి కూడా ఆ దిశగా ప్రోత్సహించాడు. కానీ విజయ్ తన దృష్టిని సినిమాల వైపు మళ్లించాడు.
ఈవిషయం తెలుసుకున్న విజయ్ తండ్రి ఆగ్రహంతో దారితప్పున్నవ్.. నా కళ్ల మందు ఉండొద్దు అని హెచ్చరిస్తే ఇంటి నుంచి పారిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు పారిపోవడంతో తండ్రి రోజంతా వెతికాడు. చివరకు ఓ థియేటర్ దగ్గరకు వెళ్లగా అక్కడ దొరికాడు. దీంతో తండ్రి ఏం చేయలేక సినిమా చాన్స్ ఇప్పిస్తా కానీ డిగ్రీ పూర్తి చేయాలని షరతు విధించాడు. ఇక విజయ్ విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు.
విజయ్ తండ్రి సీనియర్ దర్శకుడు అని మనకు తెలిసిందే. అయితే తన దర్శకత్వంలో కాకుండా ఇతర క్లాసిక్ డైరెక్టర్లను తన కొడుక్కి హీరో పాత్ర ఇవ్వండని కోరేవాడు. దానికి వారు ‘‘సారీ.. మీ వాడు హీరో ఏంటండీ.. అసలు నటుడిగానే పనికిరాడు.. బండమొహం వాడిది’’ అని మొహం మీదే చెప్పేశారట.
ఇక విజయ్ తండ్రి ఓ పెద్ద సాహసానికి దిగారు. రూ.60లక్షలు అప్పు తెచ్చి విజయ్ ను హీరోగా పెట్టి ‘నాళయ తీర్పు’ అనే సినిమా తీశారు. ఈ సినిమాకు 12ఏండ్ల వయస్సున్న ఎంఎం శ్రీలేఖను సంగీత దర్శకురాలిగా చాన్స్ ఇచ్చి గిన్నీస్ రికార్డుకు ఎక్కారు. ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్ అయినా.. సినిమా ప్లాప్ అయ్యింది. విజయ్ ను అందరూ ఎగతాళి చేస్తే రెండు నెలలు బయటకు రాలేదు. అయితే అతడి ఫ్రెండ్సే ‘నువ్వంటే ఏంటో నిరూపించు’ అని ధైర్యం నూరిపోశారు. ఇక ఆ తర్వాత ‘సెందూరపాండి’ అనే సినిమా తీశారు. ఈ సినిమాలో విజయ్ కాంత్ పైసా తీసుకోకుండా గెస్ట్ రోల్ వేశారు. ఈ సినిమా హిట్ కావడంతో అప్పులు తీర్చుకున్నారు.
ఇక ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లు..ఇలా తన మార్క్ తో విజయ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. తెలుగులో వచ్చిన ‘శుభాకాంక్షలు’ విజయ్ సినిమా రీమేక్ మూవీనే. అలాగే తెలుగులో వచ్చిన ఖుషీ, పోకిరిని తమిళంలో విజయ్ చేశారు. స్నేహితుడు, తుపాకీ, సర్కార్, విజయ్, విజిల్ , మాస్టర్, బీస్ట్, వారిసు, లియో..ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకుని తమిళ నంబర్ వన్ గా ఎదిగాడు.
ఈక్రమంలో విజయ్ ఇవాళ తన రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతోందని విజయ్ వెల్లడించాడు. 49 ఏండ్ల విజయ్ ఇక సినిమా ప్రయాణంతో పాటే రాజకీయ జీవితాన్ని కొనసాగించబోతున్నారు.