Balayya vs. Jagan : ఏపీలో హాట్ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఇప్పుడు సొంత గూటికి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రంగంలోకి దిగారు. కౌన్సిలర్లు ఎందుకు టీడీపీలోకి వచ్చారు. మళ్లీ ఎందుకు సొంత గూటికి వెళ్లిపోయారు? అని సమాచారం ఇవ్వాలని ఆయన సన్నిహితులకు సూచించారని తెలిసింది. వైసీపీకి చెందిన కౌన్సిలర్లను పిలిపించుకున్న మాజీ సీఎం జగన్ వారితో చర్చలు జరిపారు. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తుందని తెలుస్తుంది.
ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలో ఉంది. మూడున్నరేళ్ల క్రితం హిందూపురం మున్సిపాలిటీలోని 38 స్థానాల్లో పోటీ చేసి 30 స్థానాలు దక్కించుకుంది వైసీపీ. టీడీపీ కేవలం 6 చోట్ల, బీజేపీ ఒక చోట, ఎంఐఎం ఒక చోట గెలిచాయి. మెజారిటీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఉండడంతో హిందూపురానికి ఇంద్రజ మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరుతామని ఎమ్మెల్యే బాలకృష్ణ వద్దకు వెళ్లారు. అందుకు నిరాకరించిన బాలకృష్ణ 11 మందిని మాత్రమే చేర్చుకునేందుకు అంగీకరించారు. ఇదే సమయంలో చైర్ పర్సన్ ఇంద్రజ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు.
ఆగస్ట్ 20న మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. చైర్మన్ పదవి రెండు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నా నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. రంగంలోకి దిగిన మాజీ సీఎం జగన్ హిందూపురం కౌన్సిలర్లను పిలిపించుకొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలు ఉషా కిరణ్ వైసీపీ కౌన్సిలర్లతో చర్చలు జరిపించారు. నలుగురు కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు అంగీకరించారు.
మెజారిటీ పరంగా చూస్తే వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. మూడో వార్డు కౌన్సిలర్ లక్ష్మీని చైర్ పర్సన్ గా పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీని చైర్ పర్సన్ గా దింపితే తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసింది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. రిసార్టు రాజకీయాలు నడిపేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నారని తెలిసింది.