Balayya : టాలీవుడ్ లో తన సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ దిశగా ముందుకు సాగుతున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ మొదటి రౌండ్ నుంచి ముందంజలో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్ధి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి దీపికపై ఆయన ఆధిక్యం చూపుతున్నారు.
అందరి దృష్టి బాలయ్యపైనే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 1985 నుంచి ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధిస్తున్నది. 2019 ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ గెలిచిన మూడు అసెంబ్లీ స్థానాల్లో హిందూపురం ఒకటి. ఈసారి కూడా హిందూపురంలో గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే బాలయ్య భావిస్తుండగా.. టీడీపీ జోరుకు అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో వైఎస్సార్సీపీ పని చేసింది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో లైవ్ అప్డేట్స్ ద్వారా చూద్దాం..
హిందూపురం చరిత్ర
1955 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నుంచి కల్లూరు సుబ్బారావు హిందూపురం అసెంబ్లీ తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 1965లో జరిగిన ఉప ఎన్నికలో కేఎస్ రావు విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అంజనారెడ్డి గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ నేత సోమశేఖర్ గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి తిప్పే స్వామి విజయం సాధించారు. 1983లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన పామిశెట్టి రంగనాయకులు విజయం సాధించారు.
టీడీపీ హవా..
1985లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లోనూ ఎన్టీఆర్ హిందూపురం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ గెలుపొందారు. 1999లో సీసీ వెంకట్రాముడు విజయం సాధించాడు. 2004 జరిగిన ఎన్నికల్లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘనీ విజయం సాధించారు.
బాలకృష్ణ మెజార్టీ ఇలా..
2014లో నందమూరి బాలకృష్ణ వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌పై 16,196 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2019 ఎన్నికల్లో రిటైర్డ్ పోలీస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్‌పై బాలకృష్ణ 17వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
2024 ఎన్నికల్లో కురుమ సామాజిక వర్గానికి చెందిన దీపికను వైఎస్సార్సీపీ హిందూపురం అభ్యర్థిగా నిలబెట్టింది.
మూడుసార్లు అభ్యర్థుల మార్పు
హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చేసింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నవీన్ నిశ్చల్ పోటీచేసి బాలయ్య చేతలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గత అభ్యర్థిని మార్చి మాజీ పోలీస్ అధికారి ఇక్భాల్ ను బరిలోకి దించగా అతను కూడా బాలయ్య చేతిలో ఓటమి చెందారు. మూడోసారి సైతం వైసీపీ అభ్యర్థిని మార్చింది. మహిళా అభ్యర్థి దీపికను వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపగా, అధికారపార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న ఇక్బాల్ అనూహ్యంగా టీడీపీలో చేరారు. టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో ఈసారి కూడా బాలకృష్ణ గెలిచి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నారని నందమూరి అభిమానుల సంబురాలకు సిద్ధమయ్యారు.